తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఇటీవల బాహుబలి సీరిస్‌లో రాజమాత శివగామిగా పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతమైన అభినయంతో అందర్ని అలరించిన ఆమె ప్రధాన పాత్రగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాణి శివగామి’. ఈ చిత్రానికి మధు మిణకన్ గుర్కి దర్శకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకం పై మురళీ కృష్ణ దబ్బుగుడి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు ఫస్ట్‌లుక్‌ను బోనాల పండుగ సందర్భంగా విడుదల చేశారు.
కాగా ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ రమ్యకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రమిది. ఆమెను కొత్తకోణంలో ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. పీరియాడిక్ డ్రామా విత్ సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
దర్శకుడు మధు మిణకన్ గుర్కి మాట్లాడుతూ తొమ్మిదవ శతాబ్ధంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్ధం వరకు కొనసాగుతుంది. ఈ కాలఘట్టంలో జరిగే సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. ఈ చిత్రంలో యుద్ద సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా వుంటాయన్నారు. ఈ చిత్రానికి వీర్ సమ్రత్ సంగీతం సమకూర్చగా బాల్‌రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తారు.


