‘ఉయ్యాల జంపాల’ అంటూ మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన హీరో రాజ్ తరుణ్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వెంటనే ఏదో ఒక సినిమా చేసేయకుండా చాలా కథలు విన్నాక ఇప్పటికి రెండో ప్రయత్నం ‘సినిమా చూపిస్త మావ’తో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. ఆగష్టు 14న విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
‘ఉయ్యాల జంపాల’తో హిట్ కొట్టిన రాజ్ తరుణ్-అవికా గోర్ ఈ సినిమా ద్వారా మరోసారి మెప్పించారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక ‘సినిమా చూపిస్త మావ’ హిట్ టాక్‌తో రెండో వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సినిమా యూనిట్ హైద్రాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్‌కు హీరో రాజ్ తరుణ్, దర్శకుడు త్రినాథరావు, నటుడు రావు రమేష్ తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దర్శకుడు త్రినాథరావు అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించిందంటే ఆయన సినిమాపై ఆయనకున్న ప్యాషనే కారణం. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన రావు రమేష్ గారు ఈ సినిమాకు అసలైన హీరో. హీరోగా నేను కాకపోతే ఇంకొకరు చేయగలరు. రావు రమేష్ గారి పాత్రను ఆయనే చేయాలి. ఇక టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ విజయంతో మా కష్టానికి మంచి ఫలితం దక్కింది అనుకుంటున్నా” అని తెలిపారు.


