సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!

సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!

Published on Apr 27, 2024 3:01 AM IST
Rathnam Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విశాల్‌, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగి బాబు, మురళీ శర్మ తదితరులు.

దర్శకుడు: హరి

నిర్మాత: దేవీ శ్రీ ప్రసాద్

సంగీత దర్శకుడు: ఎం. సుకుమార్

సినిమాటోగ్రఫీ: టీ ఎస్ జయ్

ఎడిటింగ్: కార్తికేయన్ సంతానం

సంబంధిత లింక్స్: ట్రైలర్

కథ :

రత్నం (హీరో విశాల్) ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముద్రఖని) అనుచరుడిగా ఉంటాడు. పన్నీర్ స్వామి కోసం ఏం చేయడానికి అయినా రత్నం సిద్ధంగా ఉంటాడు. మంచి కోసం రత్నం బ్యాచ్ హత్యలు కూడా చేస్తారు. మరోవైపు మల్లిక (ప్రియా భవానీ శంకర్) పై కొంతమంది రౌడీలు ఎటాక్ చేస్తారు. ఆమెను చంపడానికి వెంబడిస్తారు. కానీ, వారి నుంచి రత్నం ఆమెను రక్షిస్తాడు. అసలు మల్లిక ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు ?,
రత్నం మల్లిక కోసం ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు?, ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది?, చివరకు రత్నం మల్లిక కోసం ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ఫిల్మ్ లో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా విశాల్ పాత్ర, ఆ పాత్రకు హీరోయిన్ పాత్రకు మధ్య లింక్ కొత్తగా ఉంది. విశాల్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ కొన్ని పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో విశాల్ చాలా బాగా నటించి మెప్పించాడు.

ఇక విలన్ పాత్రలో నటించిన మురళీ శర్మ తన నటనతోనూ మరియు తన బాడీ ఈజ్ తోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన ప్రియా భవానీ శంకర్ కి పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సముద్రఖని నటన కూడా సహజంగా ఉంది. గౌతమ్ మీనన్, యోగి బాబు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఈ చిత్రంలోని మాస్ టేకింగ్ అండ్ యాక్షన్ మేకింగ్ స్టైల్ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ ‘రత్నం’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో విశాల్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే దర్శకుడు హరి పనితనం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం వంటి ఎలిమెంట్స్ బాగాలేదు.

మొత్తమ్మీద దర్శకుడు హరి సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ యాక్షన్ స్టోరీలో కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. ఇక మిగిలిన కంటెంట్ అంతా రొటీన్ గా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. దర్శకుడు హరి స్క్రిప్ట్ పరంగా ఆకట్టుకోలేకపోయారు. ఇక సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ఎం. సుకుమార్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాత కార్తికేయన్ సంతానం పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘రత్నం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. కొన్ని ఎమోషన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అలాగే రెగ్యులర్ స్క్రీన్ ప్లేలో వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా విశాల్ నటన ఆకట్టుకున్నా.. ఈ సినిమా మాత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు