ప్రేమికుల రోజు కానుకగా సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికేట్‌ను పొందింది. సాధారణంగా ప్రేమకథా చిత్రాలకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించే రేటింగ్స్ వస్తాయి. కానీ ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ రేటింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని చిత్ర డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని వెల్లడించారు. సెన్సార్ బోర్డు వారు సినిమా టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని.. ‘U/A’ సర్టిఫికేట్ కావాలంటే టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల్’గా మార్చాలని సూచించారని ఆయన తెలిపారు. అయితే, టైటిల్ మార్చడం వల్ల ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడుతుందని భావించిన మేకర్స్, ‘కపుల్ ఫ్రెండ్లీ’ పేరునే ఉంచాలని నిర్ణయించుకుని ‘A’ సర్టిఫికేట్‌ను అంగీకరించారు. సినిమాలో ఎలాంటి అసభ్యత లేదని, ఇది పూర్తి స్థాయి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని ఆయన స్పష్టం చేశారు.
యూవీ కాన్సెప్ట్స్ మరియు అజయ్ కుమార్ రాజు పి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.
