ఓటీటీ సమీక్ష : రిపోర్టింగ్ లైవ్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ సమీక్ష : రిపోర్టింగ్ లైవ్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Published on Oct 10, 2026 9:52 AM IST

ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్‌
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : అక్టోబర్ 09, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : పరిణీతి చోప్రా, దేవెన్ భోజని, శేఖర్ సుమన్, అమోల్ పాలేకర్, శాశ్వత చటర్జీ, ఆదిల్ హుసేన్, నాజర్, సమీర్ కొచ్చర్ తదితరులు
దర్శకత్వం : ధృవ్ త్రిపాఠి
నిర్మాతలు : జోషువా శిర్సత్, పార్థ కిరణ్ ఠాకూర్, అమిత్ జె చౌదరి
సంగీతం : శాశ్వత్ సచ్‌దేవ్
ఛాయాగ్రహణం : అవినాష్ అరుణ్
కూర్పు : శ్యామ్ సల్గౌంకర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్ చిత్రాల్లో జర్నలిజం నేపథ్యం, రాజకీయ కుట్రల చుట్టూ తిరిగే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. తాజాగా ఇదే కోవలో అందాల భామ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘రిపోర్టింగ్ లైవ్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. సమాజంలో జరుగుతున్న ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టే క్రమంలో ఒక జర్నలిస్ట్ ఎదుర్కొన్న సవాళ్లు ఎలా ఉంటాయనేది మనకు ఈ సినిమాలో చూపెట్టారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఒక నగరంలో హఠాత్తుగా ఒక పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంతెన కూలిపోయి అనేకమంది ప్రాణాలు కోల్పోతారు. మొదటి చూపులో ఇది ఒక ప్రమాదంగా అనిపించినప్పటికీ, దీని వెనుక భారీ స్థాయిలో ఇసుక మాఫియా, రాజకీయ నాయకుల అక్రమాలు ఉన్నాయని ఒక సిన్సియర్ టీవీ రిపోర్టర్ సంధ్య యాదవ్(పరిణీతి చోప్రా) అనుమానిస్తుంది. తన కెమెరామెన్ సాయంతో కేసు లోతుల్లోకి వెళ్లి నిజాలను శోధించడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు శక్తివంతమైన వర్గాల నుంచి ప్రాణహాని ఎదురవుతుంది. చివరికి ఆ జర్నలిస్ట్ ఈ స్కామ్‌ను ఎలా ఛేదించింది? ఎలాంటి ఆధారాలతో మాఫియా ముసుగును తొలగించి ‘లైవ్’గా నిజాలను బయటపెట్టింది? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధాన బలం పరిణీతి చోప్రా పెర్ఫార్మెన్స్. ధైర్యసాహసాలు కలిగిన ఒక టీవీ రిపోర్టర్‌గా ఆమె ఎంతో సహజంగా నటించింది. ఎమోషనల్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలోనూ ఆమె చూపించిన డెప్త్ ఆకట్టుకుంటుంది.

సమాజంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, మీడియా లాయల్టీ అనే అంశాలను ఎంచుకోవడం మంచి ప్రయత్నం. సినిమా ప్రారంభం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వంతెన ప్రమాదం, దాని తర్వాతి ఇన్వెస్టిగేషన్ సీన్లు ఫస్ట్ హాఫ్‌ను వేగంగా ముందుకు నడిపిస్తాయి.

అనవసరమైన లవ్ ట్రాక్‌లు లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కథకే పరిమితం కావడం ప్లస్ పాయింట్. ఇక సినిమాను ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:

ఒక రియలిస్టిక్ లేదా క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన ప్రధాన అంశం సస్పెన్స్. సెకండ్ హాఫ్‌లోకి వచ్చాక ఆ ఉత్కంఠ క్రమంగా తగ్గిపోతుంది. సన్నివేశాలు చాలా రొటీన్‌గా సాగుతాయి.

ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ వచ్చే ట్విస్టులు ఊహకందేలా ఉంటాయి. ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచే స్థాయిలో డ్రామా పండలేదు. ప్రధాన పాత్రలు ఎదుర్కొనే ప్రమాదాలు పెద్దగానే ఉన్నా, ప్రేక్షకుడు ఆ పాత్రలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా సీన్లు డిజైన్ చేయలేదు.

నెగిటివ్ పాత్రలు బలంగా లేకపోవడం వల్ల కథలో రావలసిన ఘర్షణ అంతగా పండలేదు. సెకండాఫ్‌లో సాగే స్క్రీన్ ప్లే పై ఇంకా బెటర్‌గా వర్క్ చేయాల్సింది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు ధృవ్ త్రిపాఠి ఎంచుకున్న సబ్జెక్ట్ మంచిదే అయినప్పటికీ, దాన్ని స్క్రీన్‌పై ఉత్కంఠభరితంగా ఆవిష్కరించడంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో డ్రామా తగ్గడంతో గ్రాఫ్ పడిపోయింది. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బీజీఎం కొన్ని ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలకు బాగానే కుదిరింది. అవినాష్ అరుణ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. క్రైమ్ వాతావరణానికి తగిన మూడ్ లైటింగ్ వాడారు. సెకండాఫ్‌లో ఎడిటింగ్ విషయంపై ఇంకా ఫోకస్ పెట్టాల్సింది. తెలుగు డబ్బింగ్ యావరేజ్‌గా ఉంది.

తీర్పు:

మొత్తానికి, ‘రిపోర్టింగ్ లైవ్’ అంటూ వచ్చిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ఒక రొటీన్ థ్రిల్లర్ మూవీగానే మిగిలింది. పరిణీతి చోప్రా పర్ఫార్మెన్స్, ఎంచుకున్న మంచి పాయింట్ మరియు ఆసక్తికరమైన ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే, ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్, ఉత్కంఠ లేని సన్నివేశాలు మైనస్ పాయింట్లుగా నిలుస్తాయి. ఇన్వెస్టిగేటివ్ లేదా జర్నలిజం నేపథ్యం ఉన్న సినిమాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు