సమీక్ష : “వ్యూహం” – సిల్లీ ప్లేతో సాగే పొలిటికల్ డ్రామా !

సమీక్ష : “వ్యూహం” – సిల్లీ ప్లేతో సాగే పొలిటికల్ డ్రామా !

Published on Mar 3, 2024 3:02 AM IST
VYOOHAM Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధా కృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, కోట జయరాం తదితరులు

దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ

నిర్మాత: రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్

సంగీత దర్శకులు: ఆనంద్

సినిమాటోగ్రాఫర్‌: సజీస్ రాజేంద్రన్

ఎడిటింగ్: మనీష్ ఠాకూర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వియస్ వీరశేఖర రెడ్డి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) మరణంతో ఈ కథ మొదలవుతుంది. వియస్సార్ కొడుకు ‘వియస్ మదన్ మోహన్ రెడ్డి’ (అజ్మల్ అమీర్) తన తండ్రి మరణం వార్త విని చనిపోయిన ప్రజల కోసం యాత్ర మొదలు పెడతాడు. అది ఇష్టం లేని ప్రతిపక్షాలు మదన్ పై కుట్రలు పన్నుతాయి. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మదన్ మోహన్ రెడ్డి పై సీబీఐ దాడులు ఎలా జరిగాయి?, మదన్ అరెస్ట్ అయ్యి ఎలాంటి బాధలు అనుభవించాడు?, ప్రతిపక్ష నేత ఇంద్రబాబును అన్నిరకాలుగా రాజకీయంగా ఎదుర్కొని మదన్ ఎన్నికల్లో ఎలా గెలిచి సీఎం అయ్యాడు ?, ఈ మధ్యలో మదన్ కి అతని భార్య వియస్ మాలతి రెడ్డి (మానస రాధా కృష్ణన్)
ఎలాంటి సపోర్ట్ అందించింది?, అలాగే ఈ మధ్యలో శ్రవణ్ (పవన్) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలను, అలాగే తన తండ్రి బాటలో నడవాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి జగన్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు?, అధికారంలో ఉన్న అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కి ఎలాంటి వార్నింగ్ లు వచ్చాయి ?, ఇటు మిగిలిన ప్రతిపక్షాల నుంచి ఎలాంటి కుట్రలు జగన్ పై జరిగాయి ?, అయినప్పటికీ, జగన్ తన లక్ష్యం కోసం ఎలా పోరాడాడు ?, సమర్ధవంతంగా సీఎం ఎలా అయ్యాడు ? వంటి అంశాలు సినిమాలో ఆర్జీవీ బాగానే చూపించాడు. కొన్ని సింబాలిక్ షాట్స్ ను కూడా ఆర్జీవీ చాలా బాగా చూపించాడు.

నటీనటుల విషయానికి వస్తే.. మదన్ మోహన్ రెడ్డిగా అజ్మల్ అమీర్ చాలా బాగా నటించాడు. ఒరిజినల్ పాత్రకు అనుగుణంగా అజ్మల్ అమీర్ ఇచ్చిన హావభావాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి. అదే విధంగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మానస రాధా కృష్ణన్ కూడా చాలా బాగా నటించింది. ఇంద్రబాబు పాత్రలో నటించిన నటుడు కూడా ఆ పాత్రకు పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. అలాగే ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, కోట జయరాం లతో పాటు మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ నటులందరూ ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఆర్జీవీ తీసుకున్న వాస్తవిక కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల చాలా సింపుల్ గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీక్వెన్సెస్ అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. ఇక మదన్ మోహన్రెడ్డి- ప్రత్యర్థి పార్టీ నాయకుల మధ్య వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా న్యూస్ పేపర్లలోని వార్తల్నే సీన్స్ గా రాసుకున్నారు.

మొత్తానికి దర్శకుడు ఆర్జీవీ తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. అలాగే, స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఆర్జీవీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వీటికి తోడు సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. ఫస్ట్ హాఫ్ మెత్తం ఎక్కువుగా మూడు నాలుగు పాత్రల మధ్యే నడిపడంతో సినిమాని బాగా సాగతీసినట్లుగా అనిపిస్తుంది.

పైగా సినిమాలో ఏ భాగంలోనూ కొత్త విషయాలు లేకపోగా అందరికీ తెలిసిన విషయాలనే మళ్ళీ చూపించడం.. వాటిని కూడా విజువల్ గా కాకుండా డైలాగ్ ల రూపంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చెప్పాలనుకున్న కథలో డెప్త్ లేదు. పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మలచలేకపోయాడు. సంగీత దర్శకుడు ఆనంద్ సమకూర్చిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సజీస్ రాజేంద్రన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ ‘వ్యూహం’లో కొన్ని పొలిటికల్ సీన్స్ పర్వాలేదు. అలాగే కొన్ని సింబాలిక్ షాట్స్ కూడా ఆకట్టుకుంటాయి. అయితే, రెగ్యులర్ ప్లే అండ్ బోరింగ్ సీక్వెన్సెస్ మరియు రొటీన్ గా సాగే పొలిటికల్ సీన్స్.. ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ వ్యూహం సినిమాలో కొన్ని అంశాలు వైసీపీ అభిమానులకు మాత్రమే కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు