
తెలుగు ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న పీరియడ్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ 9 ఏళ్ళు పాటు ఎంతో సోధించి, పరిశోధించి, శ్రమించి రాసుకున్న కథ రుద్రమదేవి. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవిత కథతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. ఒకేసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా ఇటీవలే మాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా తమిళ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. రుద్రమదేవి తమిళ ట్రైలర్ కి తమిళ ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారంతా హై రేంజ్ గ్రాఫిక్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ ని చూసి గుణ టీంని మెచ్చుకుంటున్నారు.
ఈ సినిమాలో టైటిల్ రోల్ లో అనుష్క కనిపించనుంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. రెండు రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తెలుగు వెర్షన్ కి వాయిస్ ఓవర్ కూడా అందించాడు. రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. జూన్ 26న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు.