
ఓరుగల్లు ఘనతను చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క శెట్టి ‘రుద్రమదేవి’ పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్, మహా శివరాత్రి కానుకగా, ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
గుణ టీం వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో బందిపోటుగా అల్లు అర్జున్ నటించారు. ఇప్పటికే విడుదలైన అనుష్క లుక్, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి.
కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మేస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తుంది. ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది.

