వారికి అంతగా నచ్చిన సాహో మన వారికి మాత్రం….!

వారికి అంతగా నచ్చిన సాహో మన వారికి మాత్రం….!

Published on Sep 14, 2019 7:32 AM IST

భారీ బడ్జెట్ తో అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన సాహో మొదటి షో కే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సాహో చిత్రానికి సినీ విమర్శకుల దారుణమైన రివ్యూలు ఇచ్చారు. తెలుగు మరియు హిందీ భాషలో సాహో పూర్తి నెగెటివ్ రివ్యూ లు పొందింది.దీనితో సాహో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయం అని అందరూ భావించారు.

ఐతే రివ్యూలకు భిన్నంగా సాహో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు ఏకంగా నైజాం, నెల్లూరు ఏరియాలలో అల్ టైం బ్లాక్ బస్టర్ బాహుబలి 2 ని మించిన వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు రెండు వారాలకు గాను సాహో అన్ని భాషలలో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్టు నిర్మాతలు కలెక్షన్స్ పోస్టర్ విడుదల చేశారు.

ఐతే ఈ మొత్తం చాలా ఎక్కువగా అనిపించినా సాహో థియరిటికల్ రైట్స్ అమ్మిన లెక్కతో పోల్చుకుంటే తక్కువే అని చెప్పాలి. ఓవర్సీస్ మరియు ఆంధ్రా, సీడెడ్ ఏరియాలలో సాహో వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. ఇక తమిళనాడు, కేరళలో పరిస్థితి దారుణం గా ఉందని అక్కడ సాధించిన కలెక్షన్స్ చూస్తే అర్థం అవుతుంది. నైజాంలో మాత్రం దాదాపు 70శాతం వసూళ్లను సాధించింది.

ఆశ్చర్యకరంగా సాహో హిందీ వర్షన్ సంచనాల వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటికే సాహో బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది. అక్కడ సాహో రెండు వారాలకు గాను దాదాపు 140 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలలో సాహో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. బాలీవుడ్ లో సాహో లాభాల బాట పట్టినట్టే లెక్క.

తెలుగుతో పాటు సౌత్ భాషలలో అష్టకష్టాలు పడుతున్న సాహో హిందీలో వసూళ్ల పరంగా దూసుకుపోవడం ఆశ్చర్యంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు మించిన అభిమానం ఉత్తరాది ప్రజలు ప్రభాస్ పై చూపించడం గమనార్హం. సాహో హిందీ ప్రేక్షకులకు నచ్చగా, తెలుగు వారికీ ఎందుకు నచ్చడం లేదు అనేది తెలియాల్సివుంది. దీనితో ప్రభాస్ పరిస్థితి రచ్చ గెలిచి ఇంట ఓడినట్లైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు