సమీక్ష : ‘సర్కారు నౌకరి’ – కాన్సెప్ట్ బాగున్నా.. సినిమా కనెక్ట్ కాదు !

సమీక్ష : ‘సర్కారు నౌకరి’ – కాన్సెప్ట్ బాగున్నా.. సినిమా కనెక్ట్ కాదు !

Published on Jan 1, 2024 8:50 PM IST
Sarkaaru Noukari Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఆకాష్, భావన వళపండల్, తణికెళ్లభరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రమ్య పొందూరి, త్రినాధ్ తదితరులు.

దర్శకుడు : శేఖర్ గంగనమోనీ

నిర్మాత: కె. రాఘవేంద్ర రావు

సంగీతం: శాండిల్య,

సంబంధిత లింక్స్: ట్రైలర్
 

ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ‘సర్కారు నౌకరి’ సినిమాతో హీరోగా వచ్చారు. దర్శకేంద్రుడు గా… ఆయనకు చెందిన ఆర్.కె. టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. మరి శేఖర్.జి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.

కథ :

గోపాల్ (ఆకాష్) కొల్లాపూర్ తాలూకు గ్రామాల్లో నిరోధ్ వాడటం గురించి అవగాహన కల్పించి.. నిరోధ్ లను వాళ్ళకి అందుబాటులోకి తీసుకువచ్చే జాబ్ చేస్తుంటాడు. అయితే, అతని భార్య సత్య (భావన వళపండల్)కి ఆ జాబ్ ఇష్టం ఉండదు. దాంతో తానో.. ఉద్యోగమో తేల్చుకోమని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అసలు గోపాల్ చేసే ‘సర్కారు నౌకరి’ అతని భార్యకు ఎందుకు ఇష్టం ఉండదు ?, తన జాబ్ కోసం భార్యను కూడా నిర్లక్ష్యం చేసేంత పట్టుదల గోపాల్ కి ఎందుకు ఉంటుంది ?, అతని గతం ఏమిటి ?, 1990ల్లో ఎయిడ్స్ పై ప్రజల్లో ఎలాంటి భావన ఉండేది ?, చివరికి గోపాల్ తన ‘సర్కారు నౌకరి’తో ఎలాంటి పోరాటం చేశాడు ?, ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.  

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక గోపాల్ పాత్రలో ఆకాష్ చాలా బాగా నటించాడు. ఎమోషనల్‌ గా సాగే తన పాత్రలో తన కళ్లతోనే సున్నితమైన భావోద్వేగాలుపండించాడు. ఇక సత్యగా భార్య పాత్రలో భావన వళపండల్ నటన ఆకట్టుకుంది. అలాగే, సినిమాలో ఫ్యామిలీ ట్రాక్ కూడా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా కథనం స్లో అవుతుందనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ వస్తూ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. కథలో అంతర్లీనంగా ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. ఎయిడ్స్ పై అవగాహన కల్పించే క్రమంలో హీరోకు ఎదురయ్యే అనుభవాలను, చివర్లో అతని సక్సెస్ కి లింక్ చేస్తూ చెప్పిన విధానం బాగుంది. ఊరు సర్పంచ్ గా తణికెళ్లభరణి చాలా బాగా నటించారు. అలాగే సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రమ్య పొందూరిలతో పాటు త్రినాధ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మొదటి నుంచి ప్లే స్లోగానే సాగుతోంది. కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం దర్శకుడు శేఖర్ గంగనమోనీ చాలా నెమ్మదిగా కనిపించారు. ఇక పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ అండ్ సీన్స్ కూడా బోరింగ్ గానే సాగాయి. దీనికి తోడు ఎమోషన్ కోసం పెట్టిన శివ – గంగ రెండు పాత్రలు సినిమాలో ల్యాగ్ పెంచడానికే ఉపయోగపడ్డాయి. ఇక సినిమాలో సెకండాఫ్ కూడా స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. ఇక మ్యూజిక్ సినిమా స్థాయికి తగ్గట్లు లేదు. ఇలాంటి సహజమైన నేపథ్యంలో కావాల్సినన్నీ ఎమోషన్స్ ఉన్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోదు.  

సాంకేతిక విభాగం :

శేఖర్ గంగనమోనీ దర్శకుడిగా ఈ సినిమాకు బాగానే న్యాయం చేశారు. ఐతే, ఆయన కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సినిమా స్క్రిప్ట్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు శాండిల్య అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత కె. రాఘవేంద్ర రావు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.  

తీర్పు :

గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘సర్కారు నౌకరి’లో ఎమోషన్స్, కొన్ని కామెడీ సీన్స్ మరియు పాత్రల మధ్య సున్నితమైన సంఘర్షణలు ఆకట్టుకున్నాయి. అయితే, స్క్రీన్ ప్లేలో స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం, స్క్రిప్ట్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు నచ్చుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు