
‘బలుపు’, ‘పండగ చేస్కో’ లాంటి రెండు హిట్ సినిమాల తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని తన కొత్త సినిమా దిల్‌రాజు ప్రొడక్షన్లో ఉండనుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు-గోపీచంద్ మలినేని.. ఈ కాంబినేషన్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా, తాజాగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ, హిందీల్లో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మురుగదాస్, గోపీచంద్ కొత్త సినిమాకు కథను సమకూరుస్తున్నారు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని, మురుగదాస్‌లు స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. ఇదే విషయాన్ని గోపీచంద్ తెలియజేస్తూ, మురుగదాస్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం తన సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. గతంలో మురుగదాస్ వద్ద గోపీచంద్ మలినేని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గురువు కథతో శిష్యుడు సినిమా రూపొందించనుండడం విశేషంగా కనిపిస్తోంది. కాగా ఈ ప్రాజెక్టులో హీరోగా ఎవరు నటిస్తారనే విషయమై ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యాక ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

