ఎల్బీ నగర్‌లో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ నూతన బ్రాంచ్

ఎల్బీ నగర్‌లో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ నూతన బ్రాంచ్

Published on Mar 1, 2026 8:01 AM IST

Seven Oaks Pet Hospital Opens New Branch in LB Nagar

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్’ బ్రాంచ్‌ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. జూబ్లీహిల్స్, కొంపల్లిలో ఇప్పటికే విజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రి, పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఎల్బీ నగర్‌లో ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది.

ఈ ఆస్పత్రిలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి చిన్న జంతువులకు అత్యాధునిక చికిత్స అందిస్తారు. దేశంలోనే తొలిసారిగా పెంపుడు జంతువుల కోసం ఎంఆర్ఐ (MRI) స్కానింగ్ సౌకర్యాన్ని ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. మనుషుల కోసం వాడే యంత్రాలకు బదులుగా, కేవలం జంతువుల కోసమే డిజైన్ చేసిన ప్రత్యేక రోగ నిర్ధారణ పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ శ్రీ రెడ్డి తెలిపారు. మనుషులకు అందించే తరహాలోనే జంతువులకూ మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆస్పత్రి ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్’కు విరాళంగా ఇస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది. ఆర్థికంగా వెనుకబడిన వారి పెంపుడు జంతువులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి ఎండీ డాక్టర్ సంధ్య బి. రెడ్డి తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు అనారోగ్యంతో ఉన్న వీధి జంతువులను తమ వద్దకు తీసుకొస్తే సగం ఖర్చుతోనే చికిత్స చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

తాజా వార్తలు