అమితాబ్‌ను ఆదరించిన జనం సన్నీ డియోల్‌ను ఎందుకు ఒప్పుకోలేదు?.. ‘బట్వారా 1947’ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై షబానా ఆజ్మీ

అమితాబ్‌ను ఆదరించిన జనం సన్నీ డియోల్‌ను ఎందుకు ఒప్పుకోలేదు?.. ‘బట్వారా 1947’ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై షబానా ఆజ్మీ

Published on Aug 29, 2026 10:00 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘బట్వారా 1947’. ఈ చిత్రం థియేటర్లలో బాక్సాఫీస్ పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా పరాజయంపై చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ తాజాగా స్పందించారు.

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో షబానా ఆజ్మీ మాట్లాడుతూ.. ‘బట్వారా 1947’ చిత్రం థియేటర్లలో సరైన ఫలితాన్ని రాబట్టలేకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. సినిమా బాగుందని, మంచి సందేశం ఉందని పలువురు ప్రశంసించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని పేర్కొన్నారు. సన్నీ డియోల్‌ను ముస్లిం పాత్రలో ప్రేక్షకులు అంగీకరించలేకపోవడమే ఇందుకు ఒక కారణమని ఆమె విశ్లేషించారు.

గతంలో అమితాబ్ బచ్చన్ ‘కూలీ’ వంటి చిత్రాల్లో ముస్లిం పాత్రలు చేశారని, ‘దీవార్’లో ఆయన 786 బ్యాడ్జ్ ధరించినప్పుడు జనం సులభంగా స్వీకరించారని గుర్తుచేశారు. అయితే సన్నీ డియోల్ విషయంలో ప్రేక్షకులు ఎందుకు భిన్నంగా స్పందించారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

సినిమా చూసిన కొందరు సన్నీ డియోల్ పాత్రను పాకిస్థానీగా పొరబడ్డారని, నిజానికి ఆయన భారతీయుడైన ముస్లిం పాత్రనే పోషించారని షబానా ఆజ్మీ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ నేపథ్య కథలను తెరపై చూపించడం ఎంతో సవాలుగా మారిందని, సినిమాలో ఎలాంటి రాజకీయపరమైన తప్పులు లేవని తెలిపారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రీతి జింటా మరో కీలక పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు