విడుదల తేదీ : ఫిబ్రవరి 13, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రి, నానా పటేకర్, అవినాష్ తివారి, తమన్నా భాటియా, దిషా పటాని తదితరులు
దర్శకుడు : విశాల్ భరద్వాజ్
నిర్మాత: సాజిద్ నడియాడ్‌వాలా
సంగీతం : విశాల్ భరద్వాజ్
ఛాయాగ్రహణం : బెన్ బెర్నార్డ్
కూర్పు : ఆరిఫ్ షేక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటైన షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ తాజాగా ‘ఓ రోమియో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
1995 ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో ఉస్తర(షాహిద్ కపూర్) ఓ కాంట్రాక్ట్ కిల్లర్. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖాన్(నానా పటేకర్) దగ్గర సుపారి తీసుకుని నేరస్థులను చంపుతుంటాడు. ఈ క్రమంలో అఫ్షాన్(త్రిప్తి డిమ్రి) ఓ నలుగురిని చంపాలంటూ ఉస్తరను కోరుతుంది. తన భర్తను చంపిన వారిలో జలాల్(అవినాష్ తివారి) ముఖ్య పాత్ర అని ఆమె చెబుతుంది. కానీ జలాల్‌ను చంపడం కుదరదని ఉస్తర ఆమెకు చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత అఫ్షాన్ ప్రయాణం ఎటువైపు సాగింది..? ఉస్తరతో ఆమె ఎందుకు ఉండాల్సి వచ్చింది..? అఫ్షాన్‌ను ఉస్తర ప్రేమిస్తాడా..? చివరకు ఏం జరిగింది..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
విశాల్ భరద్వాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో షాహిద్ కపూర్ తన పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా అతడి అవతారం మెప్పిస్తుంది. ఇక ఆయన చేసే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఆకట్టుకుంటాయి. త్రిప్తి డిమ్రి తన పాత్రలో ఒదిగిపోయింది. పగ తీర్చుకునేందుకు సాయం కోరే వ్యక్తిగా బాగా నటించింది.
ఇక షాహిద్-త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ కొన్నిచోట్ల మెప్పిస్తాయి. వారి మధ్య వచ్చే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలో వచ్చే థియేటర్ యాక్షన్ సీన్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ఇక ప్రేమలో ఉండే బాధను షాహిద్ కపూర్ పండించిన తీరు ఆకట్టుకుంటుంది.
సినిమాలోని కొన్ని ట్విస్టులు కూడా బాగుంటాయి. ముఖ్యంగా త్రిప్తి నుంచి వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ప్రేయసి కోసం హీరో ఎంతవరకైనా వెళ్లే సన్నివేశాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో వచ్చే యాక్షన్ మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్, యాక్షన్, రొమాన్స్ అంశాలన్నింటిని కలిపేయడంతో సినిమా ఏ జోనర్‌లో వెళ్తుందనేది అయోమయానికి గురిచేస్తుంది. హీరోను పవర్‌ఫుల్ పాత్రలో చూపెడుతూ ఆయనతో చెప్పించే డైలాగులు కొంతవరకు వర్కవుట్ కావు. ఈ సినిమాను ఆయన తీర్చిదిద్దిన తీరు బాగున్నా, కోర్ పాయింట్ మాత్రం చాలా రొటీన్.
కథను ముందుకు నడిపించే క్రమంలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ మెప్పించవు. ఫస్ట్ హాఫ్‌లో స్లో పేస్ ప్రేక్షకులను విసిగిస్తుంది. యాక్షన్ మినహా ఫ్లాట్‌గా సాగే నెరేషన్ మెప్పించదు. ఇక హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ కూడా అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నా, వారి పాత్రలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వనట్లు అనిపిస్తుంది. తమన్నా పాత్ర ఆకట్టుకోదు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే క్యామియో పాత్ర కూడా వేస్ట్ అయినట్లు అనిపిస్తుంది.
యాక్షన్ సీక్వెన్స్‌లు స్టైలిష్‌గా ఉన్నా, వాటి ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో కొంతవరకు అతిగా కూడా అనిపిస్తుంది. హీరో-విలన్ మధ్య క్లైమాక్స్ పోర్షన్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. సంగీతం పరంగా పాటలు పెద్దగా ప్రభావం చూపలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ ఈ సినిమా కోసం తీవ్రంగానే కష్ట పడినట్లు అనిపిస్తోంది. అయితే, కథలో కోర్ పాయింట్ సింపుల్‌గా ఉండటంతో యాక్షన్, రొమాన్స్‌ను యాడ్ చేసి కథను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. ఇక స్క్రీన్ ప్లే పరంగా కూడా ఆయన ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. బెన్ బెర్నార్డ్ సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే. సాంగ్స్ పర్వాలేదనిపించినా, బీజీఎం ఆకట్టుకుంటుంది. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘ఓ రోమియో’ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా పూర్తిస్థాయిలో మెప్పించదు. షాహిద్ కపూర్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. వీక్ రైటింగ్, స్లోగా సాగే సీన్స్ ఆకట్టుకోని మ్యూజిక్ మైనస్‌గా నిలిచాయి. యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


