‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి షాలిని పాండే. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్న షాలిని తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ పరిశ్రమలోకి కూడ ప్రవేశించింది. ప్రసుతం ఈ రెండు పరిశ్రమల్లోనూ ఆమెకు ఆఫర్లు ఉన్నాయి. ఈ రెండు పరిశ్రమలు కాకూండా ఆమె బాలీవుడ్లోకి కూడ ప్రవేశిస్తోంది. ఇప్పటికే రన్వీర్ సింగ్ చేయనున్న కొత్త చిత్రంలో కథానాయకిగా ఎంపికైంది షాలిని. ఇది ఆమె కెరీర్ ను మలుపు తిప్పే అవకాశం.
ఇది కాకుండా ఓ స్టార్ హీరో కుమారుడి డెబ్యూ సినిమాలో కూడ ఆమె కథానాయకిగా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఆమిర్ ఖాన్. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతని సరసన హీరోయిన్ గా షాలిని ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని యాష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. షాలిని పాండే యాష్ రాజ్ ఫిలింస్ సంస్థతో మూడు సినిమాల ఒప్పందానికి సైన్ చేసిందట. అందులో భాగంగానే జునైద్ ఖాన్ సినిమాలో అవకాశం దక్కించుకుందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తేనే తెలుస్తుంది.
