రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తిన శంకర్!

shankar-rajmouli
ప్రతి సినీ అభిమానీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన సినిమా ‘బాహుబలి’ ఎట్టకేలకు గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మూడేళ్ళుగా ఎదురుచూసాక వచ్చిన ఓ ప్రతిష్టాత్మక సినిమా థియేటర్లలో పడితే ఎలా ఉంటుందో ‘బాహుబలి’ మొదటి వారాంతం కలెక్షన్లు నిరూపించి చూపాయి. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుండీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. బాహుబలి సినిమాకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం బాహుబలి టీమ్‌ను సంబరాల్లో ముంచెత్తింది. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్, బాహుబలి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. “బాహుబలి సినిమా ఆలోచన, సృజన, క్యారెక్టరైజేషన్, హీరోయిజం పరంగా అద్భుతం. వీటన్నింటినీ అద్భుతమైన విజువల్స్‌తో చెప్పడం చాలా బాగుంది. రాజమౌళి, అతడి టీమ్‌కు అభినందనలు” అంటూ బాహుబలి సినిమాపై శంకర్ ట్విట్టర్‌లో ప్రశంసలు గుప్పించారు.

సౌతిండియాలో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతాలను చేసి చూపిన దర్శకుడు శంకర్ దగ్గర్నుంచి ఇంత గొప్ప ప్రశంస దక్కడంతో రాజమౌళి టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రాజమౌళి తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.

Exit mobile version