
‘పండగ చేస్కో’ హిట్ తర్వాత జోరు మీదున్న హీరో రామ్ ‘శివమ్’, ‘హరికథ’ టైటిల్స్‌తో రెండు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘శివమ్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈమధ్యే స్వీడన్, నార్వేల్లో ఓ భారీ షెడ్యూల్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో నార్వే, స్వీడన్‌లలోని పలు అందమైన లొకేషన్స్‌లో మూడు పాటలను చిత్రీకరించారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇక ఈ ఫారిన్ షెడ్యూల్ గురించి హీరో రామ్ మాట్లాడుతూ.. నార్వే, స్వీడన్లలో ఓ సూపర్ షెడ్యూల్ పూర్తైందని, మరో రెండు పాటల షూటింగ్‌తో సినిమా దాదాపుగా పూర్తవుతుందని తెలిపారు. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా హై వోల్టేజ్ లవ్ స్టోరీగా ప్రచారం పొందుతోంది. రామ్ స్టైల్ లవ్ ఎపిసోడ్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇదని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని రామ్ ఈ సందర్భంగా తెలిపారు.