
‘శ్రీమంతుడు’, ‘వేదాళం’.. తెలుగు, తమిళ భాషల్లో ఇలా రెండు సూపర్ హిట్ సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న శృతి హాసన్, తెలుగులో అనౌన్స్ అవ్వడానికంటే ముందే క్రేజీగా మారిపోయిన ‘తని ఒరువన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు చివరిదశకు చేరుకున్నాయి.
ఇక ఈ నేపథ్యంలోనే క్యాస్టింగ్ ప్రక్రియను కూడా మొదలుపెట్టేశారు. సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటైన విలన్ పాత్ర కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూండగా, హీరోయిన్‌గా మాత్రం శృతి హాసన్‌ను దాదాపుగా ఖరారు చేశారట. గతంలో ‘ఎవడు’ సినిమాతో మెప్పించిన రామ్ చరణ్ – శృతి హాసన్‌ల జంట మళ్ళీ తని ఒరువన్ రీమేక్‌తో జత కట్టనున్నట్లు వార్త రావడం విశేషంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హాలీడేలో ఉన్న రామ్ చరణ్, తిరిగొచ్చాక డిసెంబర్ నెలలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

