
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో మెరిసిన సిద్దార్థ్.. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయారు. సిద్దార్థ్ తెలుగులో చేసిన చివరి సినిమా.. ‘జబర్దస్త్’. ఆ సినిమా పరాజయం తర్వాత సిద్ధూ తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు. అయితే ఈ సమయంలో తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోయారు. ‘జిగర్ తండా’, ‘కావ్య తలైవన్’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ‘జిగర్‌తండా’ను ‘దిల్‌రాజు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాను తెలుగులో ‘నాలో ఒక్కడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ కొంత భావోద్వేగంగా మాట్లాడారు. “నాకు లైఫ్ ఇచ్చిందే తెలుగు సినిమా. నేను కొన్నేళ్ళ పాటు హైద్రాబాద్‌లోనే ఉన్నా. నేను హీరోగా ఎదిగింది కూడా తెలుగు సినిమా ద్వారానే! అయితే ఓ సమయంలో నేను చేస్తున్న సినిమాలు నాకు సంతృప్తినివ్వడం తగ్గించాయి. నటుడిగా నేనేంటో నిరూపించుకునే అవకాశం కోసం తమిళంలో సినిమాలు చేస్తున్నా. కొన్నాళ్ళుగా తెలుగు సినిమా చేయకున్నా తెలుగు సినిమాకు దూరం కాలేదు. త్వరలోనే తప్పకుండా నేరుగా తెలుగులో సినిమా చేస్తా” అంటూ తన భావాలను పంచుకున్నారు సిద్దార్థ్. ‘నాలో ఒక్కడు’ సినిమాకు ప్రసాద్ రమర్ దర్శకత్వం వహించారు.