తమిళ హీరో శింబు గురించి తెలుగులోనూ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సింగర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా చాలా పాత్రల్లో మెప్పించిన ఈ హీరో కెరీర్ గత మూడు సంవత్సరాలుగా అయోమయంగా కనిపిస్తూ వచ్చింది. శింబు హీరోగా నటించిన ‘వాలు’ అనే సినిమా మూడేళ్ళ పాటు విడుదలకు నోచుకోకుండా అతడి కెరీర్‌ను అస్తవ్యస్థం చేసి చివరకు ఈమధ్యే విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా విజయం తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన శింబు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ మళ్ళీ తన కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చారు.
కాగా ఈ క్రమంలోనే శింబు హీరోగా నటిస్తోన్న ‘కాన్’ అనే సినిమాకు ప్రొడక్షన్ మధ్యలో బ్రేక్ పడింది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ఎంతోకాలంగా శ్రమించి రాసుకొని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులన్నీ రోజురోజుకీ పెరిగిపోవడంతో సినిమా యూనిట్ కాన్ ప్రొడక్షన్‌కు బ్రేక్ వేసింది. ఇదే విషయాన్ని దర్శకుడు సెల్వ రాఘవన్ స్పష్టం చేస్తూ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని, మళ్ళీ త్వరలోనే అన్ని ఇబ్బందులనూ అధిగమించి సినిమాను మొదలుపెడతామని తెలిపారు. ఇక శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా డిసెంబర్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
