
కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే పేరుతో ఓ సోషియో ఫాంటసీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతుండగా నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.
లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఇక ఇదిలా ఉంచితే ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్లను నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29న విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. అదే రోజు నాగ చైతన్య సినిమా టీజర్, అఖిల్ సినిమా టీజర్ కూడా విడుదల కానుండడంతో అక్కినేని అభిమానులకు ఆరోజు పండగ రోజనే చెప్పొచ్చు.

