సోనాల్ చౌహాన్ ఈ సంవత్సరం వరుసగా పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె ఈ సంవత్సరం తన 4వ సినిమాగా బాలకృష్ణ తో కలిసి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ‘డిక్టేటర్’ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో నా క్యారెక్టర్ రంగీలా సినిమాలో ఊర్మిళ క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది నన్ను నా మొదట టీవీ షో ‘షో బిజ్’ రోజుల్లోకి తీసుకెళ్ళింది. నా పాత అనుభవాలను నాకు గుర్తు చేసింది’ అన్నారు. ఆమె హీరో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ‘ ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ఉండటానికి ఆయనే కారణం. ఆయనతో కలిసి నటించిన లెజెండ్ గనక వర్కవుటవ్వకుంటే ఇప్పుడు నేనిక్కడ ఉండేదాన్ని కాదు’ అన్నారు.
లౌక్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘డిక్టేటర్’ సినిమాకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా..ఎస్ ఎస్ ధమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీవాస్ స్వయంగా ‘ఈరోస్ నౌ బ్యానర్’ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావటం విశేషం.
