కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూరి ఖాతాలో మరో ఘన విజయం చేరింది. ఆయన లీడ్ రోల్‌లో నటించిన తాజా రా అండ్ రస్టిక్ చిత్రం ‘మందాడి’ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవగా, తెలుగులోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘మందాడి’ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. అక్టోబర్ 8 నుంచి ఈ సినిమాను తమ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. సౌత్ ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో సూరి ‘కాళి’ అనే శక్తిమంతమైన పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకున్నారు.
సముద్ర తీర నేపథ్యంతో కూడిన రా అండ్ రస్టిక్ కథ
మతిమారన్ పుగజేంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్‌రెడ్ కుమార్ నిర్మించారు. సముద్రపు అలల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటాలు, సహజసిద్ధమైన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూడలేకపోయిన సినీ ప్రియులతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త కంటెంట్‌ను కోరుకునే ప్రేక్షకులను సైతం ఈ సినిమా మెప్పించడానికి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


