స్పెషల్ ఫోకస్ : 2015లో ప్రారంభమైన పరభాషా సంగీత దర్శకుల జోరు.. !

anirudh-gopi-gibran

సంగీతానికి, స్వరాలకు భాషతో సంబంధం లేదు. ముక్త కంఠంతో అందరు అంగీకరించే మాట ఇది. ఇళయరాజా, బప్పి లహరి, ఎమ్మెస్ విశ్వనాథన్, ఎఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులను తెలుగు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆదరించారు. గత దశాబ్ద కాలంగా తెలుగులో పరభాషా సంగీత దర్శకుల హవా తగ్గిందనే చెప్పాలి. మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్, చక్రి, తమన్, అనూప్ రూబెన్స్ వంటి తెలుగు సంగీత దర్శకులు సత్తా చాటడంతో పరభాషా సంగీత దర్శకుల జోరు తగ్గింది. 2015లో తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది కొందరు స్టార్ హీరోల సినిమాలకు ఇతర భాషా సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చే భాద్యత తమ భుజాలపై వేసుకున్నారు.

అనిరుధ్ రవిచంద్రన్ :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించే సినిమాకు తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ‘కొలవేరి డి’ అనే ఒకే ఒక్క పాటతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ 24 ఏళ్ళ కుర్రాడు తమిళంలో హాట్ ఫేవరెట్. వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తుండడంతో అతనిపై చరణ్ కన్ను పడింది. తమిళంలో విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. గత ఏడాది విజయ్ ‘కత్తి’, ‘విఐపి'(తెలుగులో రఘువరన్ బిటెక్) సినిమాలతో విజయాలు అందుకున్నాడు.

గోపి సుందర్ :

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా చూసిన ప్రేక్షకులకు గోపి సుందర్ సుపరిచితమే. అతని పాటలు, నేపధ్యం సంగీతం మనసును హత్తుకున్నాయి. తమిళ, మలయాళ భాషల్లో ఇతని సంగీతం విన్న ప్రసాద్ వి పోట్లురి కింగ్ నాగార్జున – కార్తిల మల్టీస్టారర్ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. క్రేజీ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడంతో 100% కృషి చేస్తానని చెప్తున్నాడు. మలయాళంలో 40పైగా సినిమాలకు సంగీతం అందించిన అనుభవం గోపి సుందర్ సొంతం. ‘బెంగుళూరు డేస్’ ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ సినిమాలతో గోపి సుందర్ ప్రతిభ అందరికి తెలిసింది.

జిబ్రాన్ :

కమల్ హసన్ తో హట్రిక్ సినిమాలకు సంతకం చేసినప్పుడే తమిళ చిత్రసీమ కన్ను జిబ్రాన్ పై పడింది. ‘రన్ రాజా రన్’తో ఈ యువ సంగీత దర్శకుడి ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించే క్రేజీ సినిమాకు సంగీతం అందించే అవకాశం జిబ్రాన్ ను వరించింది. జిబ్రాన్ సౌండింగ్ లో ఓ కొత్తదనం ఉంటుంది. అది శ్రోతలకు, సినీ ప్రముఖులకు బాగా నచ్చింది. త్వరలో ‘ఉత్తమ విలన్’ ఆడియోతో జిబ్రాన్ సందడి చేయనున్నారు.

హరి :

రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో కన్నడ సంగీత దర్శకుడు హరి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇటివల విడుదలైన ఈ సినిమా పాటలు సుధీర్ బాబు అభిమానులను అలరిస్తున్నాయి.

Exit mobile version