‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం 1975’. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోద్, రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా నుండి విడుదలైన ‘చూసాలే కళ్లారా, చుక్కల చున్నీకే’ పాటలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. దీంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగింది. టీజర్ సైతం ఆకట్టుకుంది. దీంతో ట్రేడ్ వర్గాల్లో కూడ సినిమాకు మంచి ధరే పలికింది.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఈ సినిమా హక్కుల్ని 4 కోట్లకు సొంతం చేసుకున్నారు. చిన్న హీరో అందులోనూ కేవలం ఒకే ఒక సినిమా చేసిన హీరో చిత్రం ఈ స్థాయి రేటు పలకడం అంటే విశేషమే అనాలి. లాక్ డౌన్ వలన సినిమా ఆలస్యమైంది కానీ లేకుంటే ఈపాటికే విడుదల కావాల్సింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మే నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది.
