టీవీ అండ్ ఓటీటీ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో శ్రామిక ప్యానెల్ ఘనవిజయం.. అధ్యక్షుడిగా కొయ్యలమూడి రాకేష్

టీవీ అండ్ ఓటీటీ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో శ్రామిక ప్యానెల్ ఘనవిజయం.. అధ్యక్షుడిగా కొయ్యలమూడి రాకేష్

Published on Aug 1, 2026 8:00 AM IST

తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో ‘శ్రామిక ప్యానెల్’ వర్గానికి చెందిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. హైదరాబాద్‌ కృష్ణా నగర్‌లోని ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొయ్యలమూడి రాకేష్ (నాని) అధ్యక్షుడిగా, పుట్టా విజయ్‌కుమార్ ప్రధాన కార్యదర్శిగా 95 శాతం మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. రాకేష్ నాని ఈ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కాగా, ప్యానెల్ నుంచి పోటీ చేసిన మరో 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విజయం అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు రాకేష్ నాని మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి తమ కమిటీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఫెడరేషన్ పరిధిలోని 24 విభాగాల్లో దాదాపు 7,000 మంది సభ్యులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో గానీ లేదా ప్రమాదవశాత్తు గానీ ఏ సభ్యుడైనా మరణిస్తే, బాధిత కుటుంబానికి గంట వ్యవధిలోనే రూ. లక్ష తక్షణ ఆర్థిక సాయం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.

టీవీ అడ్హాక్ కమిటీ ఛైర్మన్ పి. మురళి, వైస్ ఛైర్మన్ బి. మోహన్‌రాజుల నేతృత్వంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. హైకోర్టు అడ్వకేట్ కె.వి.ఎల్. నరసింహారావు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించగా.. ఉపాధ్యక్షుడిగా కె. నరేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా రమేష్ మాస్టర్, ఎస్.కె. ఖుద్దూస్, జాయింట్ సెక్రటరీలుగా కె. ఈశ్వర్, ఎం.వి.వి. కృష్ణమూర్తిలతో పాటు ఈసీ సభ్యులు, ఇతర నియోజకవర్గ ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు