నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు రీసెంట్గా విలన్ రాఘవ్ జుయల్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘రంగస్థలం’ సినిమా సమయంలో సుకుమార్ వద్ద కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెలకి, షూటింగ్ చివరి రోజు రాంచరణ్ ఒక ప్రత్యేకమైన లాకెట్‌ను బహుమతిగా ఇచ్చారట.
చెన్నైలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా డిజైన్ చేయించిన ఆ లక్కీ లాకెట్‌ను చరణ్ తనకు ఇవ్వగా, ఆ రోజు నుంచి ఇప్పటివరకు దానిని ఎప్పుడూ తీయలేదని శ్రీకాంత్ తెలిపారు. అయితే ఇటీవల రాంచరణ్‌ను కలిసినప్పుడు ఈ లాకెట్ గురించి ప్రస్తావించగా, చరణ్ ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.
ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కోసం అంకితభావంతో రేయింబవళ్లు శ్రమిస్తున్న ఆయన, ప్రమోషన్లలో భాగంగా పంచుకున్న ఈ మెమరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా హీరోలతో ఉన్న ఈ సెంటిమెంట్ అనుబంధం సినిమా వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ప్రత్యేక చర్చకు దారితీసింది.
