
శ్రీమంతుడు.. మహేష్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం విజయం నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ అనే సంస్థ తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. నవీన్ ఎర్నేని, రవి శంకర్, సీవీ మోహన్లు కలిపి నెలకొల్పిన ఈ సంస్థ గతంలో పలు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇక శ్రీమంతుడు’ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇక తమ మొదటి సినిమా అయిన ’శ్రీమంతుడు’ తమకు సరికొత్త ఎనర్జీని తెచ్చిపెట్టిందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. “మొదటి సినిమాయే మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమా కావడం మా అదృష్టం. ఆయన నిర్మాతల నటుడు. సెట్లో ఎప్పుడూ సరదాగా ఉంటూ, అంతటా పాజిటివ్నెస్ తెచ్చిపెట్టేవారు మహేష్. ఈ సినిమా మంచి కలెక్షన్లతో పాటు మాకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. భవిష్యత్లో ఇదే కోవలో అన్ని జానర్లలో సినిమాలు చేస్తాం. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కొరటాల శివతోనే ఉంటుంది. నవంబర్ లేదా డిసెంబర్లో ఆ సినిమా మొదలుపెడతాం” అని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలిపారు.

