
సూపర్ స్టార్ మహేష్ సినిమాకు అమెరికాలో ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్యే విడుదలైన ‘శ్రీమంతుడు’ సినిమా యూఎస్‌లో మహేష్ స్టామినా ఏంటో మరోసారి ఋజువు చేసింది. సుమారు 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసి యూఎస్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే శ్రీమంతుడు టీమ్ అమెరికాలోని న్యూజెర్సీలో ఓ భారీ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
‘శ్రీమంతుడు’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ న్యూజెర్సీలో ఓ సక్సెస్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయనున్న విషయాన్ని తెలియజేశారు. తెలుగు జనాభా ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో శ్రీమంతుడు సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సక్సెస్ మీట్‌ను కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేసి యూఎస్ ప్రేక్షకులిచ్చిన సక్సెస్‌కు కృతజ్ఞతలు తెలపాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 24న పెద్ద ఎత్తున నిర్వహించే ఈ వేడుకకు మహేష్, శృతి హాసన్‌లతో పాటు మిగతా యూనిట్ సభ్యులు, నటీనటులంతా హాజరవుతారని మైత్రీ మూవీస్ టీమ్ తెలిపింది.

