తమిళంలోనూ ఆగష్టు 7నే రానున్న ‘శ్రీమంతుడు’!

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు తమ హీరోను ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూస్తున్న ఎదురుచూపులకు మరో రెండు వారాల్లో తెరపడనుంది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ భారీ అంచనాల మధ్య ఆగష్టు 7న విడుదల కానున్న విషయం తెలిసిందే! మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఇక ఈ మధ్యే విడుదలైన ఆడియో, టీజర్‌లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమా విషయమై మహేష్ ఒక పత్రికతో మాట్లాడుతూ తమిళ డబ్ వర్షన్ గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా మంచి పాపులరిటీ ఉన్న మహేష్ సినిమాలు కొన్ని తమిళంలోనూ డబ్ అవుతూ వచ్చాయి. అయితే అవేవీ నేరుగా తెలుగు వర్షన్ రిలీజ్ రోజే విడుదలవ్వలేదు. కాగా శ్రీమంతుడు తమిళ డబ్బింగ్ వర్షన్ మాత్రం తెలుగు వర్షన్ రిలీజ్ రోజే, అంటే ఆగష్టు 7నే విడుదల కానున్నట్లు మహేష్ బాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. మహేష్ తరువాతి సినిమా ‘బ్రహ్మోత్సవం’ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే!

Exit mobile version