నా లైఫ్‌లో అదే బెస్ట్ కాంప్లిమెంట్ : మహేష్

నా లైఫ్‌లో అదే బెస్ట్ కాంప్లిమెంట్ : మహేష్

Published on Aug 20, 2015 10:38 PM IST

mahesh-babi
సూపర్ స్టార్ మహేష్ సినిమాకు హిట్ టాక్ వస్తే దాని రేంజ్ ఎలా ఉంటుందనేది గతంలో చాలా సినిమాలు చూపించాయి. ఇప్పుడు తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమా ఆ లిస్ట్‌లో కొత్తగా వచ్చి చేరింది. ఆగష్టు 7న మహేష్ పుట్టిన రోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు మొదలైన శ్రీమంతుడు సినిమా పండగ అభిమానులకు సంబరాన్ని తెచ్చిపెట్టింది. విడుదలైన నాటినుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ళ పరంగానే కాక, విమర్శకుల ప్రశంసల పరంగానూ సూపర్ అనిపించుకుంది. ముఖ్యంగా ఒక సోషల్ మెసేజ్‌తో ముడిపడి ఉన్న కథనాన్ని దర్శకుడు కొరటాల శివ కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చెప్పిన విధానానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తమ సినిమాకు ఈ స్థాయి విజయం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు, అభిమానులకు థ్యాంక్స్ తెలిపేందుకు ‘శ్రీమంతుడు’ యూనిట్ హైద్రాబాద్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకకు గల్లా జయధేవ్, కే.ఎస్.రామారావు అతిథులుగా హాజరు కాగా, సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, సంపత్ రాజ్‌లతో నిర్మాతలు నవీన్, రవి శంకర్, చీవీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌కు షీల్డ్స్ అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సినిమాకు ఈ స్థాయి విజయాన్ని చేకూర్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక మహేష్ మాట్లాడుతూ.. “సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకు రెండో హీరో అంటే దేవిశ్రీయే! ఇంతపెద్ద విజయాన్ని సమకూర్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రెండు వారాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈమధ్యే కాకినాడకు చెందిన అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ అబ్బాయి, ‘శ్రీమంతుడు’ సినిమా చూశాక నన్ను కలవాలనుకున్నాడు. నేను వెళ్ళి అతణ్ణి కలిశాక ‘శ్రీమంతుడు చూశా.. ఇట్స్ మార్వెలెస్’ అన్నాడు. ఆ కాంప్లిమెంట్ నా జీవితంలో ది బెస్ట్. అభిమానుల అలరించేందుకు ఎప్పుడూ మంచి సినిమాలు చేస్తూనే ఉంటా” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు