
దర్శకుడు శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే హ్యూమర్ అంతా ఇంతా కాదు. తెలుగు సినీ పరిశ్రమలో కామెడీకి పెద్దపీట వేస్తూ శ్రీనువైట్ల చేసిన పలు విజయవంతమైన చిత్రాలు ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా శ్రీనువైట్ల సినిమాల్లో ఆయనతో పాటు రచయితలుగా పనిచేసిన కోనవెంకట్ – గోపీ మోహన్ల భాగస్వామ్యం కూడా మరచిపోలేది. ఈ ముగ్గురూ కలిసి తెలుగు సినిమాకు ఢీ, రెడీ, దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్ విజయాలను అందించారు.
కాగా ‘బాద్షా’ సినిమా సమయంలో శ్రీనువైట్ల, కోన వెంకట్‌లకు వచ్చిన బేధాభిప్రాయాల కారణంగా శ్రీనువైట్ల తర్వాతి ‘ఆగడు’కు ఈ ముగ్గురు కలిసి పనిచేయలేదు. అయితే శ్రీనువైట్ల హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్రూస్ లీ కోసం ఈ ముగ్గురు కలిసి పనిచేయాలని పట్టుబట్టి హీరో రామ్ చరణ్ ఈ కాంబినేషన్‌ను మళ్ళీ కలిపారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘బ్రూస్ లీ’ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేస్తూ కోన వెంకట్ అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించారు.
ఇక ఈ చాట్ సెషన్ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కోన వెంకట్ పలు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ‘బ్రూస్ లీ సినిమా కోసమే రామ్ చరణ్, శ్రీనువైట్లతో మీ కాంబినేషన్‌ను మళ్ళీ కలిపారని అన్నారు? శ్రీనువైట్లతో నెక్స్ట్ సినిమాకు పనిచేస్తారా?’ అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు, “శ్రీనువైట్లతో మళ్ళీ కలిసి పనిచేస్తానో లేదో ఇంకా తెలియదు” అని సమాధానం ఇచ్చారు. ‘మీ ముగ్గురి కాంబినేషన్లో వచ్చే నెక్స్ట్ సినిమా ఏదీ?’ అన్న ఓ ప్రశ్నకు, కోన వెంకట్.. ‘ఇది మిలియన్ డాలర్ ప్రశ్న’ అన్న సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సమాధానాలతో శ్రీనువైట్ల-కోన వెంకట్ల కాంబినేషన్ ప్రస్తుతానికి బ్రూస్ లీకి మాత్రమే పరిమితమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.