
తనదైన విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా భాష ఏదైనా తన బ్రాండ్ యాక్టింగ్‌తో దేశవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించుకున్న ప్రకాష్ రాజ్, దర్శకుడు, నిర్మాతగా కూడా పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. సినిమాల్లో ఎన్నో స్ఫూర్తిదాయక పాత్రల్లో నటించి మెప్పించిన ప్రకాష్, నిజ జీవితంలోనూ ఓ మంచి కార్యం చేపట్టి ఆదర్శంగా నిలిచారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలను దత్తత తీసుకొని బాగుపరచడమనే ఒక ఆలోచనను సమర్ధవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్నే ప్రధానాంశంగా తీసుకొని సూపర్ స్టార్ మహేష్ చేసిన శ్రీమంతుడు సినిమాతో ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్ తెలుగు నాట బలంగా నాటుకుపోయింది. సినిమాలో చేసినట్లుగానే బయటకూడా మహేష్, ఊరిని దత్తత తీసుకున్నాక తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకాన్ని ఆదర్శంగా చేసుకొని ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రెడ్డిపల్లె అనే ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. కేటీఆర్‌ను ఈ ఉదయం కలిసిన ప్రకాష్ రాజ్, ఈ అంశంపైనే పలు విషయాలను చర్చించారు. ఇక సినీ ప్రముఖులు ఇలా సమాజానికి తమకు తోచిన సహాయం చేస్తూ ఆదర్శంగా నిలవడం అభినందనీయం.

