సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మండాడి’.. రేపు 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మతిమారన్ పుగళేంది రూపొందించిన యాక్షన్ డ్రామా ‘మండాడి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి థియేటర్లలోకి తీసుకువస్తోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సముద్రం నేపథ్యంలో సాగే పడవ పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలంగా ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ సమకూర్చగా, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ యాక్షన్ సీక్వెన్స్‌లను పర్యవేక్షించారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్‌కు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, రేపు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version