‘రంగస్థలం’కు చరణ్ ను ఎంచుకోవడం వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన సుకుమార్ !

సుకుమార్, చరణ్ ల కలయికలో వచ్చిన చిత్రం ‘రంగస్థలం’ యొక్క విజయంలో సుకుమార్ డిజైన్ చేసిన చిట్టిబాబు పాత్ర, ఆ పాత్రలో నటించిన రామ్ చరణ్ యొక్క నటన ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా చూసిన చాలా మంది అసలు ఇలాంటి పాత్రలో చరణ్ లాంటి స్టార్, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోని సుకుమార్ ఎలా ఊహించుకున్నారు, ఈ ప్రయోగానికి ఎలా సాహసించారు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఈరోజు జరిగిన థ్యాంక్స్ మీట్లో ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సుకుమార్ ‘చరణ్ ఇప్పటి వరకు చాలా సినిమాయూ చేశారు. కానీ వాటిలో క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా ఒక్కటి కూడ చేయలేదు. అందుకే పాత్ర మీద ఆధారపడిన కథను రాసుకున్నాను. అదే నా సీక్రెట్. ఏ నటుడైన మంచి పాత్ర పడితే ఆడేసుకుంటాడు. ఇలాంటి పాత్ర చరణ్ కు ఇంతకుముందే పడుంటే ఈ వండర్ అప్పుడే జరిగుండేది’ అన్నారు.

అలాగే చరణ్ మాట్లాడుతూ తానెప్పుడూ అభిమానుల కోసం సినిమాలు ఒప్పుకోలేదని, ముందు కథ తనకు నచ్చితేనే అందరికీ నచ్చుతుందని, ఇంతటి సక్సెస్ ఇచ్చిన సుకుమార్ కు థ్యాంక్స్ అని అన్నారు.