సమ్మర్ 2026 : డిజాస్టర్‌గా మారిన వేసవి టాలీవుడ్ బాక్సాఫీస్

తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే 2026 సమ్మర్ సీజన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. సాధారణంగా పెద్ద సినిమాల జాతర సాగాల్సిన మే నెలలో, ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం.

టాలీవుడ్ మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూసిన రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం సైతం వాయిదా పడి చివరకు జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. తీవ్రమైన ఎండతీవ్రతతో పాటు ఐపీఎల్ 2026 సీజన్ కూడా పెద్ద సినిమాల వాయిదాకు ప్రధాన కారణాలయ్యాయి.

సినిమాలు లేక, ప్రేక్షకుల రాక కరువై రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. మే చివరి వారంలో అసలు ఒక్కటంటే ఒక్క బజ్ ఉన్న తెలుగు సినిమా కూడా రిలీజ్ కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మే నెలలో విడుదలైన చిన్న సినిమాలన్నింటినీ ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు. చివరి రెండు వారాల్లో సూర్య నటించిన డబ్బింగ్ చిత్రం ‘వీరభద్రుడు’.. మోహన్ లాల్ ‘దృశ్యం 3’ మాత్రమే థియేటర్లను కొంతవరకు కాపాడింది. మొత్తంగా, మే 2026 అనేది టాలీవుడ్‌కు భారీ నష్టాలను మిగిల్చిన డిజాస్టర్ నెలగా సినీ వర్గాల్లో గుర్తుండిపోనుంది.

Exit mobile version