సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. దర్శకులు శివ నిర్వాణ, శైలేష్ కొలను, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.
బోట్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. కార్యక్రమంలో హీరో సుహాస్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కంటెంట్ సరికొత్తగా ఉంటుందని, సూరి, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. నటుడు సూరి మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
సముద్రంలో బోట్ రేసింగ్ సన్నివేశాలను తెరకెక్కించడం ఎంతో సవాలుతో కూడుకున్నదని దర్శకులు శైలేష్ కొలను, శివ నిర్వాణ ప్రస్తావిస్తూ చిత్ర యూనిట్ పనితీరును అభినందించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
