తమిళ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సూర్య 48’ అధికారికంగా పట్టాలెక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, తాజాగా పూజా కార్యక్రమాలతో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పూజా వేడుకకు సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో, విమర్శకుల ప్రశంసలు అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అటు అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ వేడుకలో హీరో సూర్యతో పాటు చిత్ర దర్శకుడు టి.జె. జ్ఞానవేల్, హీరోయిన్ కయాదు లోహర్, నిర్మాతలు విజయ్ కిరగందూర్, చలువే గౌడ మరియు టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
