
సరికొత్త కథలతో, విభిన్న గెటప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త కథతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే! ఈ సినిమా తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల కానుంది. విడుదలకు దగ్గరవుతున్నా కొద్దీ సూర్య ‘రాక్షసుడు’ సినిమాపై అంచనాలు ఊపందుకున్నాయి. తమిళనాట అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య స్వయంగా నిర్మించారు.
ఈ సినిమాకు మొదట్నుంచీ ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రచార కార్యక్రమాల్లో మాస్ గురించి మీడియాతో మాట్లాడుతూ సూర్య కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేయనున్న విషయం తెలిసిందే. ఎవరూ లేని ఓ అనాథ దొంగగా మారి చేసే ట్రిక్కులను మాస్ పాత్రలో చూడొచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా శక్తి అనే మరో పాత్రలోనూ నటిస్తున్నారు. వీరి కథలోకి హర్రర్ అంశం ఎలా జతచేరిందన్నదే ఆసక్తికర అంశంగా తెలుస్తోంది.
ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజ్‌తో సెన్సేషన్ సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ టీజర్ లక్షల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాకున్న క్రేజ్‌ను బయటపెట్టింది. పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.