మలేసియాలో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో తన పెర్ఫార్మన్స్ సందడి చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నేరుగా హైదరాబాద్ చేరుకుంది. దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 12న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నేటి నుండి ఈ షూటింగ్ లో తమన్నా పాల్గొంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ నేతృత్వంలో ప్రభాస్ పై పాట చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. మరో వారం రోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, అడవి శేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్ 2015 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


