
తమిళ హీరో శింబు గురించి తెలుగులోనూ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సింగర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా చాలా పాత్రల్లో మెప్పించిన ఈ హీరోను తాజాగా ఓ సినిమా తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ వస్తోంది. శింబు హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన ‘వాలు’ అనే సినిమా 2012లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక కారణాలతో మూలన పడింది. ఆ తర్వాత చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తూ చివరకు జూలై 17న విడుదలకు సిద్ధమైంది.
ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ఎలాగోలా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు మళ్ళీ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బే తగిలింది. ఈ మూడేళ్ళలో వేరే ఇతర సినిమాలేవీ చేయక, ‘వాలు’ విడుదల కాక, శింబు కెరీర్ దాదాపుగా అస్తవ్యస్తమైంది. ఎట్టకేలకు శింబు తండ్రి రాజేందర్ చొరవతో ఈ సినిమా విడుదలకు సిద్ధమై చివరకు మళ్ళీ ఇలా ఆగిపోవడంతో శింబు పరిస్థితి అయోమయంగా మారిపోయింది.
ఇక శింబుకు తమిళ పరిశ్రమ నుంచి ఈ సినిమా విషయంలో మంచి సపోర్ట్ లభిస్తోంది. దర్శకులు, తోటి నటీనటులు శింబుకు ఈ సినిమా విషయంలో సపోర్ట్‌గా నిలిచారు. ఇక ఈ సినిమా గొడవను పక్కనబెట్టి శింబు తన కొత్త సినిమాల షూటింగ్‌లకు సిద్ధమైపోవడం విశేషంగా కనిపిస్తోంది. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే కొత్త సినిమా కోసం కష్టపడుతూండడం చూసి శింబును పలువురు నటులు ప్రశంసిస్తున్నారు.