టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ క్యాంపస్‌లో నాలుగేళ్లుగా సాగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొదట్లో కేవలం లైంగిక వేధింపుల ఆరోపణలుగా కనిపించిన ఈ వ్యవహారం.. ఇప్పుడు బలవంతపు మతమార్పిడులు, అంతర్జాతీయ నెట్‌వర్క్ లింకుల దాకా వెళ్లడం ఐటీ ఇండస్ట్రీని నివ్వెరపరుస్తోంది. 2022 నుంచి ఒక పద్ధతి ప్రకారం ఇదంతా జరుగుతోందని సిట్ (SIT) దర్యాప్తులో తేలడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఫిబ్రవరిలో వచ్చిన ఒక చిన్న సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నలుగురు మహిళా కానిస్టేబుళ్లను హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా టీసీఎస్ ఆఫీసులోకి పంపించారు. వాళ్లు సేకరించిన ఆధారాలు, బాధితుల వాంగ్మూలాలతో అసలు డొంక కదిలింది. ఇప్పటివరకు ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయగా.. విచారణలో మొత్తం 12 మంది దీని బారిన పడినట్లు గుర్తించారు. ఈ ముఠా మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా.. హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడటం, బలవంతంగా నమాజ్ చేయించడం, రోజా (ఉపవాసం) ఉంచమని ఒత్తిడి చేయడం లాంటి దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు నమోదు చేసిన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లలో స్పష్టమైంది. పెళ్లి పేరుతో నమ్మించి ఒక మహిళను లైంగికంగా వాడుకున్నట్లు మరో తీవ్రమైన అభియోగం కూడా నమోదైంది.
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠాకు చెందిన కొన్ని సీక్రెట్ వాట్సాప్ గ్రూపులు బయటపడ్డాయి. ఏ అమ్మాయిని టార్గెట్ చేయాలి, ఎలా బుట్టలో వేసుకోవాలి అనే విషయాలను వాళ్లు చాట్స్‌లో మాట్లాడుకున్నట్లు తెలిసింది. డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా ఫోరెన్సిక్ టీమ్ రికవరీ చేస్తోంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. మలేషియాకు చెందిన ఇమ్రాన్ అనే మతబోధకుడితో వీరికి పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు, విలాసవంతమైన జీవితం పేరుతో అతడు వీడియో కాల్స్ ద్వారా మహిళలతో మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
అయితే, బాధితులు ఇంతకాలం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే ప్రశ్నకు విచారణలో కళ్లు చెదిరే నిజం దొరికింది. బాధితులు 78కి పైగా ఈమెయిల్స్ ద్వారా హెచ్‌ఆర్ విభాగానికి మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. పాష్ (POSH) కమిటీలో మెంబర్‌గా ఉన్న ఏజీఎమ్ స్థాయి మహిళా అధికారి.. “ఎందుకు ఈ గొడవంతా, సైలెంట్‌గా వదిలేయండి” అంటూ బాధితులను బెదిరించి, నిందితులకే సపోర్ట్ చేశారు. దీంతో పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఇక వీళ్లందరికీ ‘లేడీ కెప్టెన్’గా వ్యవహరించి, యువతులను నిందితులకు పరిచయం చేసిన మరో హెచ్‌ఆర్ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. ఏరికోరి ఒకే వర్గానికి చెందిన వారిని టీమ్ లీడర్లుగా రిక్రూట్ చేయడంలో ఆమె పాత్ర ఉందన్న కోణంలో విచారణ సాగుతోంది. ఈ పరిణామాలపై టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులందరినీ వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు, కంపెనీ సీఓఓ ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో ఇంటర్నల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది.
