తెలుగు సినిమాపై తేజ సంచలన కామెంట్స్!

teja
సరికొత్త ప్రయత్నాలతో, ప్రయోగాలతో దర్శకుడు తేజ సంపాదించిన పేరు, సృష్టించిన సినిమాలు మామూలు విషయాలు కాదు. ఒకప్పుడు అంతా కొత్తవాళ్ళతోనే వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ఘనత తేజకు దక్కింది. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’.. ఈ మూడు సినిమాలు అప్పట్లో సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే అలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన తేజ ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన ఏ సినిమా తన ప్రాభవాన్ని చూపలేకపోయాయ్!

దీంతో వరుస అపజయాల తర్వాత తాజాగా ఆయన ఓ సరికొత్త ప్రయత్నంతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘హోరా హోరీ’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాపై తేజ భారీ ఆశలే పెట్టుకున్నారు. దిలీప్, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో కొత్తదనమన్నది ఈ మధ్య కాలంలో ఘనత చాటుకున్న పెద్ద సినిమాల్లో ఎప్పుడూ కనిపించలేదని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“నేనెప్పుడు కొత్త సినిమా తీసినా, ‘ఏమైనా జయం స్థాయిలో ఈ సినిమా లేదు సార్’ అంటారు. అదే జయం సినిమాలోని ఏ ఒక్క సన్నివేశం వేరే సినిమాలో యాధృచ్చికంగా వచ్చినా, ‘మళ్ళీ జయం తీశాడ్రా’ అంటారు. అసలు నన్నడిగితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఘనత చాటుకున్న పెద్ద సినిమాల్లో ఏముంది? ఒక రెండు కథలుంటాయి. వాటినే గత పదేళ్ళుగా తీస్తూ వస్తున్నారు. అందులో కొన్ని ప్రేక్షకాదరణ పొందుతూ వచ్చాయి కూడా. పెద్ద సినిమాల్లో అవే రెండు కథలను తిప్పి తీసినా ఫరవాలేదు కానీ, నేను మాత్రం ‘జయం’ చేయకూడదా?” అంటూ వ్యాఖ్యానించారు తేజ. కాగా ఆయన తన వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని కోరడం గమనార్హం.

Exit mobile version