మన తెలుగు హీరోలు తెరపై మాత్రమే కాక, నిజ జీవితంలోనూ హీరోలే అని, మానవత్వంతో స్పందించే హృదయం తమ పాత్రలకే కాక తమకూ ఉందని మరోసారి ఋజువు చేశారు. చెన్నై నగరాన్ని గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కురిసిన వర్షాలు చెన్నై నగరాన్ని అస్థవ్యస్థం చేసేశాయి. అక్కడి జనజీవనం పూర్తిగా స్థంబించిన నేపథ్యంలో వారికోసం మన తెలుగు యువ హీరోలు సైతం ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టడం చూస్తూనే ఉన్నాం.
ఇక ఈ క్రమంలోనే తెలుగు హీరోలైన రానా, నాని, అల్లరి నరేష్, నవదీప్, సందీప్ కిషన్, అఖిల్, సాయిధరమ్ తేజ్ తదితరులు ‘మన మద్రాస్ కోసం’ అన్న నినాదంతో ట్విట్టర్ వేదికగా సహయ చర్యలకు శ్రీకారం చుట్టారు. వీరంతా తమ వంతుగా సహాయం చేయడంతో పాటు మన మద్రాస్ కోసం నినాదంతో తమ అభిమానుల నుంచి కూడా ఫండ్స్, ఆహార పదార్థాలను సేకరిస్తున్నారు. హైద్రాబాద్ నుంచి చెన్నై ప్రత్యేకంగా ట్రక్కుల ద్వారా ఈ ఆహార పదార్థాలను చెన్నైకి పంపిస్తున్నారు. అదేవిధంగా డిసెంబర్ 6న ఇనార్బిట్ మాల్‌లో ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు ఈ హీరోలంతా హాజరు కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
