డిల్లీలో స్టార్ హీరో.. 40 రోజులపాటు హెవీ ఫైట్స్

డిల్లీలో స్టార్ హీరో.. 40 రోజులపాటు హెవీ ఫైట్స్

Published on Nov 2, 2019 12:00 AM IST

Vijay2

‘బిగిల్’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న విజయ్ తన తర్వాతి సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైంది. ఈరోజు డిల్లీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇది సినిమా మొత్తానికి కీలకమైన షెడ్యూల్. ఎందుకంటే సినిమాలో ఉండబోయే అధిక శాతం యాక్షన్ సన్నివేశాలను ఇందులోనే తెరకెక్కించనున్నారు.

ఈ షెడ్యూల్ సుమారు 40 రోజుల పాటు జరగనుంది. దీని కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ‘బిగిల్’ చిత్రంతో విజయ్, ‘ఖైదీ’ చిత్రంతో లోకేష్ పెద్ద హిట్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాలే అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతున్నాయి. అందుకే వీరి కలయికలో రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలున్నాయి ప్రేక్షకుల్లో.

‘ఖైదీ’తో లోకేష్ తెలుగు ప్రేక్షకుల మీద బలమైన ముద్ర వేయడంతో ఏపీ, తెలంగాణల్లో కూడా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఎక్స్.బి ఫిల్మ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 2020 వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు