మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది'(Peddi). ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో టీమిండియా యువ క్రికెటర్, 2026 టీ20 వరల్డ్ కప్ విజేత తిలక్ వర్మ సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఒక భారీ గ్రామీణ సెట్లో జరుగుతున్న చిత్రీకరణను తిలక్ వర్మ స్వయంగా వీక్షించి, చిత్ర బృందంతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు రామ్ చరణ్ ఘనస్వాగతం పలికాడు.
వరల్డ్ కప్ సాధించిన తర్వాత స్వరాష్ట్రానికి వచ్చిన తిలక్ వర్మను రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించాడు. వీరిద్దరూ కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో, ఒక అసలైన క్రీడాకారుడు సెట్స్‌కు రావడం చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ వంటి పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
