టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతున్న వివాదం చివరకు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేదికగా నేడు ఒక అత్యంత కీలకమైన సమావేశం జరగనుంది. ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు నేతృత్వంలో జరిగే ఈ చర్చల్లో ఇరు వర్గాలకు చెందిన ప్రతినిధులు ముఖాముఖి భేటీ కానున్నారు.
సినిమా పరిశ్రమ మనుగడకు ప్రాణాధారమైన పర్సంటేజ్ విధానం, రెంటల్ సిస్టమ్, మరియు ఓటీటీ విండో అంశాలే ఈ సమావేశంలో అజెండాగా మారాయి. ప్రస్తుతం థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, మరోవైపు నిర్మాతలు కూడా నష్టాల భారంతో సతమతమవుతుండటంతో.. ఆదాయ పంపకాల్లో మార్పులు చేయాలని ఇరుపక్షాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సినిమా విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలోకి రావాలనే ‘ఓటీటీ విండో’ విషయంపై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి.
ఈ మీటింగ్కు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరవుతున్నారు. గిల్డ్ నిర్మాతల తరఫున కూడా ముగ్గురు కీలక సభ్యులు పాల్గొననున్నారు. మొత్తం 10 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయనుంది.
ఇటీవల కాలంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్ధం కూడా తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ గొడవ ఇలాగే కొనసాగితే సినిమా పరిశ్రమకు తీరని నష్టం జరుగుతుందని భావించిన ఫిలిం ఛాంబర్, మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిర్మాత సి. కళ్యాణ్ స్పందిస్తూ.. నేటి చర్చల్లో సమస్యకు సానుకూల పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నేటి చర్చల అనంతరం టాలీవుడ్లో నెలకొన్న ఈ ఉత్కంఠకు తెరపడుతుందో లేదో చూడాలి.
