తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ‘దళపతి’ విజయ్ ప్రస్తుతం తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ పార్టీ TVK సాధించిన ఈ విజయం దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ రిలీజ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సెన్సార్ పరమైన అడ్డంకుల వల్ల జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం విజయ్ స్వయంగా ఈ సమస్యలను పరిష్కరించి, చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
విజయ్ ముఖ్యమంత్రి కావడంతో, ఈ సినిమాలో ఆయన పేరు ముందు ‘దళపతి’కి బదులుగా ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ ఉపయోగించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్స్‌లో మార్పులు చేస్తున్నారని కొందరు భావించారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా చిత్ర బృందం సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత పద్ధతిలోనే విజయ్ పేరుకు ముందు ‘దళపతి’ అనే టైటిల్ మాత్రమే ఉంటుందని స్పష్టమైంది.
హెచ్.వినోద్ దర్శకత్వంలో సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. సెన్సార్ సర్టిఫికేట్ అందిన వెంటనే చిత్ర యూనిట్ అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో ‘జననాయకన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
