‘డిక్టేటర్’.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేస్తోన్న 99వ సినిమా. అనౌన్స్ అయిన రోజునుంచే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఆసక్తికరంగా మారింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సినిమాలతో మెప్పించిన శ్రీవాస్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. రేపు ‘డిక్టేటర్’ టీమ్ బాలయ్య అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ మధ్యే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్, రేపు ఫస్ట్‌లుక్‌తో అభిమానులను అలరించనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 17న వినాయక చవితి సందర్భంగా హైద్రాబాద్‌లో సినిమా యూనిట్ ఒక పాటను కూడా విడుదల చేయనుంది. బాలయ్య రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎంటర్టైనింగ్ అంశాలను కూడా నింపుకున్న డిక్టేటర్ సినిమా ద్వారా ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఇక తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. అంజలి, సోనాల్ చౌహాన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
