
అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. గోగినేని శ్రీనివాస కృష్ణ దర్శకుడు. ఈ చిత్రంతో అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఆడియోను సినీ రంగ ప్రముఖుల సమక్షంలో ఫిబ్రవరి 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. రామజోగయ్య శాస్త్రి, సాహితి స్వరాలకు సాహిత్యాన్ని అందించారు.
పల్లెటూరి రాజకీయాల నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి ప్రధమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్న సాయి కొర్రపాటి బ్యానర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ‘తుంగభద్ర’పై ప్రేక్షకులలో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది.

